ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ.. ఆ బంగ్లాలో ఉండమన్న కేంద్ర ప్రభుత్వం


కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించనుంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని 5వ నెంబర్ బంగ్లాను  హౌస్ కమిటీ రాహుల్‌కు ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాహుల్ సోదరి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ భవనాన్ని పరిశీలించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. అయితే రాహుల్ గాంధీ నుంచి ఆమోదముద్ర వచ్చాకే కేంద్రం ఈ బంగ్లా విషయంలో నిర్ణయం తీసుకోనుంది. 

లోక్‌సభలో ప్రతిపక్షనేత కావడంతో రాహుల్ గాంధీ కేబినెట్ ర్యాంక్‌ను కలిగి ఉంటారు. దీని ప్రకారం ఆయన టైప్ -8 బంగ్లాకు అర్హులు. ఈ తరహా బంగ్లాలను కేంద్ర కేబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయ మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శులకు కేటాయిస్తారు. 

కాగా.. మోడీ ఇంటిపేరుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. నిబంధనల ప్రకారం లోక్‌సభ సభ్యుడు కానందున.. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని గతంలో రాహుల్‌కు పార్లమెంటరీ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ  క్రమంలో రాహుల్ ఆ బంగ్లాను ఖాళీ చేసి టెన్  జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి మారారు. నాటి నుంచి రాహుల్ అక్కడే ఉంటున్నారు. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రతిపక్షనేతగా నియమించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గడిచిన పదేళ్ల కాలంలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్షనేత కొలువుదీరినట్లయ్యింది.

రాహుల్ ఇప్పటి వరకు 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ గెలుపొందినప్పటికీ.. ఇటీవల ఆ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు. 


Comments